దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లో భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భారతీయ వ్యక్తి వినయ్ శ్రీకర్ చోడంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియన్ డాలర్లు(రూ. 8.20కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో వినయ్ శ్రీకర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. లక్కీ డ్రాలో జూన్ 30వ తారీఖున ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 3588కు జాక్‌పాట్ తగిలింది. ముంబైకి చెందిన వినయ్ శ్రీకర్ జూన్ 30న దుబాయి నుంచి సౌదీ అరేబియాలోని తబుక్ జర్నీ చేస్తున్న సమయంలో అతడు ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో సరదాగా కొన్న లాటరీ టికెట్ అతడికి కోట్లు తెచ్చిపెట్టింది. వినయ్ శ్రీకర్ టికెట్‌కు లాటరీ తగలడంతో నిర్వాహకులు అతడి ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ, కలవలేదు. దాంతో ఇతర మార్గాల్లో అతనికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ & సీఈఓ కోల్మ్ మెక్‌లౌగ్లిన్ వెల్లడించారు.
