అమెరికాలోని విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డేవ్ కాల్హౌన్ తన పదవికి రాజీనామా చేశారు. 2024 చివరి నాటికి ఆయన తన పదవి నుంచి వైదొలుగుతారని బోయింగ్ కంపెనీ తాజాగా ప్రకటించింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థ కు చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడిపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బోయింగ్ కంపెనీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అలాగే బోయింగ్ సీఈఓతో పాటు కమర్షియల్ విమానాల విభాగం అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ కూడా త్వరలో పదవీ విరమణ చేయనున్నారని వెల్లడించింది. ఆయన స్థానంలో స్టెఫానీ పోప్ బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. అంతేగాక బోర్డు ఛైర్మన్‌గా స్టీవ్ మోలెన్‌కోఫ్ ఉంటారని కంపెనీ తెలియజేసింది.