అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 34 నేరాభియోగాల్లో దోషిగా తేలారు. ఓ పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్‌హట్టన్ కోర్టు జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో ఓ మాజీ దేశాధ్యక్షుడు, ఏదైనా నేరంలో దోషిగా తేలడం ఇదే మొదటిసారి. పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చేందుకు బిజినెస్ రికార్డులను తారుమారు చేసినట్లు ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు చెల్లించారు. అయితే ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన వ్యాపార ఖాతాలను మార్చేశారు. ఆ కేసులో కొన్ని రోజుల నుంచి కోర్టు విచారణ జరిగింది. దోషిగా తేలిన ట్రంప్‌కు, జూలై 11వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు.
ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ మన్‌హట్టన్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ తప్పుపట్టారు. జూలై 11వ తేదీన తుది తీర్పు ఉంటుందని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. అయితే ఈ కేసులో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. జ్యూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని, కానీ నిజమైన తీర్పు నవంబర్ 5వ తేదీన జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో తెలుస్తుందని ట్రంప్ అన్నారు.