ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి అమెరికన్ అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)ల్లో ఒక సంస్థకు అధిపతిగా ఎన్నికైన తొలి నల్ల జాతీయుడు. గత నెల మూడో తేదీన జరిగిన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశంలో అజయ్ బంగా (63)ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేండ్ల పాటు కొనసాగుతారు. అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఇండో- అమెరికన్ కూడా. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికవ్వక ముందు ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సేవల సంస్థ మాస్టర్ కార్డ్ సీఈఓగా పని చేశారు. ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పదవికి అజయ్ బంగా పేరును గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.

1959 నవంబర్ 10న పుణెలో అజయ్ బంగా జన్మించారు. అజయ్ బంగా తండ్రి హర్బజన్ బంగా.. భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేశారు. అజయ్ బంగా విద్యాభ్యాసం జలంధర్, సిమ్లాలో సాగింది. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో భారత ప్రభుత్వం అజయ్ బంగాను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

