అగ్రరాజ్యం అమెరికాలో భారత్‌కు చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌లోని ప్రముఖ యూనివర్సిటీకి తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇండియాకు చెందిన సునీల్ కుమార్‌ను మస్సాచుసెట్స్ రాష్ట్రంలోని టఫ్ట్స్ యూనివర్సిటీ తదుపరి అధ్యక్షుడిగా నియమిస్తూ యూనివర్సిటీ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం యూనివర్సిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆంథోనీ మొనాకో పదవీకాలం ముగియగానే 14వ అధ్యక్షుడిగా జూలై 1,2023న సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా నియామయం అయిన తొలి శ్వేతజాతియేతరుడిగా ఆయన గుర్తింపు పొందారు.
సునీల్ కుమార్ తండ్రి ఓ పోలీస్ అధికారి. ఇండియాలోనే జన్మించిన సునీల్ కుమార్.. మంగళూరు యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టాపొందారు. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. 1996లో ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. సునీల్ కుమార్ గతంలో చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విభాగానికి డీన్‌గా విధులు నిర్వర్తించారు.