రాజస్థాన్‌కు చెందిన అదితీ మహేశ్వరి భారత్‌లో బ్రిటిష్ దౌత్యాధికారిగా పనిచేసే అవకాశం కొట్టేసింది. హైకమిషనర్ ఆఫ్ ది డే పోటీల్లో పాల్గొని గెలుపొందిన ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించింది. అక్టోబర్ 11న ప్రతి ఏటా అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని 2017 నుంచీ భారత్‌లోని బ్రిటన్ హై కమిషనర్ ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ మారు అదితిని ఈ అద్బుత అవకాశం వరించింది. దీంతో ఆమె ఒక్క రోజు పాటు భారత్‌లో బ్రిటన్ దౌత్యాధికారిగా పని చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ దౌత్యాధికారి విధులు, బాధ్యతలను ఎలా ఉంటాయనేది స్వానుభవ పూర్వకంగా తెలుసుకుంది. పలు అధికారిక కార్యక్రమాల్లో బ్రిటిష్ కమిషనర్ హోదాలో అదితి పాల్గొంది. ఈ అద్భుతమైన అవకాశం తనకు లభించినందుకు అదితి ఉబ్బితబ్బిబైపోయింది. వివిధ దౌత్యాధికారులతో సమావేశాలు, షీ లీడ్స్ ప్రోగ్రామ్‌లో భాగమైన మహిళలను కలుసుకోవడం మర్చిపోలేని అనుభవం అని ఆమె వ్యాఖ్యానించింది.