
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గార్లకు చెందిన పుల్లఖండం నాగేశ్వరరావు, సరిత దంపతుల కుమార్తె మేఘనారాణి (25), ముల్కనూర్‌కు చెందిన కడియాల కోటేశ్వరరావు, రేణుక దంపతుల కుమార్తె భావన (24) మూడేండ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్నారు. క్రిస్మస్ సెలవులు ఉండటంతో.. మేఘనారాణి, భావన సహా 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లారు. మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు మూలమలుపు వద్ద అదుపుతప్పి, లోయలో పడింది. వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.















