నైరోబీ ఎయిర్‌పోర్టు విస్తరణ, నిర్వహణ కోసం అదానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(కేఏఏ)ని కెన్యా జాతీయ అసెంబ్లీ ప్రజా పెట్టుబడుల కమిటీ ఆదేశించింది. టెండరు ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ జరిపే వరకు అదానీ గ్రూప్‌తో తదుపరి ప్రక్రియలను నిలిపివేయాలని సూచించింది.కెన్యా రాజధాని నైరోబీలోని జోమో కెన్యట్ట అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు(జేకేఐఏ) ఆధునికీకరణ, 30 ఏండ్ల పాటు నిర్వహణ కోసం అదానీ సంస్థ కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఎయిర్‌పోర్టు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
దీంతో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు సైతం స్తంభించాయి. పలువురు కెన్యా జాతీయ అసెంబ్లీ సభ్యులు సైతం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదానీ కంటే ఏఎల్‌జీ అనే స్థానిక సంస్థ మరింత మెరుగైన ప్రతిపాదన చేసినప్పటికీ అదానీకే ఎయిర్‌పోర్టును అప్పగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ప్రజా పెట్టుబడుల కమిటీ ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించింది.