యూకే ధనవంతుల జాబితాలో గత ఏడాది తొలిసారిగా చోటు దక్కించుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ , అక్షత మూర్తి దంపతుల సంపద ఈ ఏడాది తగ్గిపోయింది. గతంతో పోలిస్తే 53 స్థానాలు కిందకు దిగజారారు. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023 వెల్లడించిన వివరాల ప్రకారం.. రిషి-అక్షత దంపతులు ఏడాదిలో 201 మిలియన్ పౌండ్ల సంపదను కోల్పోయారు.


2022 ఏడాది యూకే ధనవంతుల జాబితాలో రిషి, అక్షత దంపతులు 730 మిలియన్ పౌండ్ల (రూ.7,104 కోట్లు)తో 222వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వారు 275వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం వారి సంపద 529 మిలియన్ పౌండ్లని అంచనా. అంటే రూ.5,448 కోట్లు అన్నమాట. ఈ ఏడాది ఏకంగా రూ.2,069 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇన్ఫోసిస్ (Infosys)లో అక్షత షేర్ల విలువ తగ్గిపోవడంతోనే వారి సంపద కరిగిపోవడానికి కారణమని తెలుస్తోంది.
