అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌లో భారతీయుల అతిపెద్ద సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్ఏ-ఎఫ్ఐఎ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026 ఏడాదికి సంబంధించి ఎఫ్ఐఎ కొత్త కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. అమెరికాలోని అతిపెద్ద భారతీయ సంఘాలలో ఒకటైన ఎఫ్ఐఎ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి శ్రీకాంత్ కావడం విశేషం.

ఎఫ్ఐఎ స్వతంత్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీకాంత్ అక్కపల్లి 2026 ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సంస్థ ప్రకటన చేసింది. పదవీ విరమణ చేసిన సౌరిన్ పారిఖ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి రే పటేల్, జనరల్ సెక్రటరీగా సృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. కొత్త బృందంతో పాటు శ్రీకాంత్ అక్కపల్లి జనవరి 1, 2026న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా వంటి పలు రంగాల్లో శ్రీకాంత్ అక్కపల్లికి అపార అనుభవం ఉంది. వాటికి సంబంధించి అమెరికాలోనే కాకుండా భారత్‌లోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ట్రాన్సిట్ టెక్నాలజీ కన్సల్టింగ్, లైఫ్ సైన్సెస్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్రీడా సామగ్రి తయారీ, ప్రీమియం ఫర్నిచర్ డిజైన్ వంటి విభిన్న రంగాల్లో వ్యూహాత్మక ప్రణాళికతో దూసుకుపోతున్నారు.

ఎఫ్ఐఎ కి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత, స్వరాష్ట్రం తెలంగాణ నుంచి ఈ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి తానే కావడం గర్వకారణమని శ్రీకాంత్ పేర్కొన్నారు. సంస్థను మరింత బలోపేతం చేసి, అందరినీ కలుపుకొని పోతూ కొత్త కార్యక్రమాలను చేపడతానని హామీ ఇచ్చారు. తనకు మద్దతు తెలిపిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు.















