
జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో దారుణం జరిగింది. అందులో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని ఆ దేశంలోని భారతీయ దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుడౌరీలోని పర్వత రిసార్ట్‌కు చెందిన బెడ్‌రూమ్స్‌లో వాళ్లంతా విగతజీవులుగా పడివున్నారని భారతీయ మిషన్ వెల్లడించింది. మృతుల వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నది. గత శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు జార్జియా పోలీసుల ప్రాథమిక విచారణ పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదుచేశారు. వారి మరణాలకు గల కారణాల్ని కనుగొనేందుకు ఫోరెన్సిక్ మెడికల్ ఎగ్జామినేషన్ దర్యాప్తు మొదలైంది. విషపూరిత వాయువు కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే వాళ్లంతా మృత్యువాత పడ్డారని పేర్కొన్నది.
