రెండు రోజుల రష్యా పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ మాస్కోకు చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.ప్రధాని మోదీ రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. సోమవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

మంగళవారం భారత్-రష్యా 22వ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు.అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై మాట్లాడనున్నారు. అనంతరం రెండు రోజుల రష్యా పర్యటనను ముగించుకుని ప్రధాని అక్కడి నుంచి ఆస్ట్రియాకు వెళ్లనున్నారు.
