కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరల్డ్‌వైడ్‌గా సినీ తారలంతా ఈ ఫెస్టివల్‌లో సందడి చేస్తుంటారు. డిజైనర్ దుస్తుల్లో ఈవెంట్‌కే కొత్త అందాన్ని తీసుకొస్తుంటారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మే 14వ తేదీన ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకూ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన సినీ ప్రముఖులు, డిజైనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తున్నారు.
తాజాగా హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితీరావు హైదరి కేన్స్‌లో మెరిశారు. హాఫ్ షోల్డర్ వైట్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌తో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఎర్ర తివాచీపై అదితి అలా నడుస్తూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఆమె వైపే తిరిగాయి. అంతకు ముందు ఈవెంట్‌లో భాగంగా ఫ్రెంచ్ రివేరాకు చేరుకున్న అదితి అక్కడ ఫొటో షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. స్టైలిష్ ఫ్లోరల్‌డ్రెస్‌లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది తారలు ఈ వేడుకల్లో తళుక్కున మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, ఊర్వశి రౌతెలా, కియారా అద్వానీ సహా పలువురు హీరోయిన్లు, డిజైనర్లు రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు.