Namaste NRI

డాలస్‌లో ఘనంగా అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా కూచిపూడి

డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్యర్యంలో  ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో  అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్యగురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొని ఉన్న సంప్రదాయం కూచిపూడి గురుకులం  డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలిలు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ  మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్సహిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందుకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంఠిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి అమోఘమని ప్రశంసించారు.

అనంతరం స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పిన సంప్రదాయం కూచిపూడి గురుకులం ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులమని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాల్లో తమ ప్రతిభా, ప్రదర్శనలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతి సోమనాథ్‌తో, చిరకాల పరిచయమని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఆమె కృషి సఫలీకృతం కావాలన్నారు. ఈ సందర్భంగా స్వామి సోమనాథ్‌ బృందాన్ని అతిథులు, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

రెండు గంటల పాటు సాగిన ప్రదర్శన శ్రీ గణనాథం తో ప్రారంభమైంది. ఒక పరి ఒక పరి, క్షీర సాగర శయన, అద్వైతం ` యోగా నృత్యం ప్రదర్శించారు. తెలుగు కవన నర్తనం ఎందరో మహానుభావులు,  ఎంకి నాయుడు బావ బ్రహ్మమొక్కటే  కిన్నెరసాని, తిల్లానా తదితర భక్త రామదాసు పాటలతో అలరించారు. స్వాతి సోమనాథ్‌, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలు చేసిన కూచిపూడి  నాట్య ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది.

ఈ కార్యక్రమంలో  రావు కల్వల, తయాబ్ కుండావాల, బీఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపుతో పాటు ఐఏఎన్టీ నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జేపీ, ముర్తుజా, ఆటా, టీపాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభోట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు పాల్గొన్నారు.

బీఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాకతీయ హాల్ నిర్వాహకులకు, డీఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, ఈ సందర్భంగా  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events