నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. కొత్తగూడెం (ముసలమ్మచెట్టు) గ్రామంలో తన మామ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ను ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యామిలీతో కలిసి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి బిఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమలు చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, తన ఎన్నికల ప్రచారానికి అల్లుఅర్జున్ వస్తాడని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పెద్దవూర మండల కేంద్రం నుండి సుమారు 5కిలోమీటర్లు బైక్ ర్యాలీ తీశారు. కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంచర్ల చంద్రశేఖర్రెడ్డి 10వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన గురవయ్య యాదవ్ పాల్గొన్నారు. అల్లుఅర్జున్ వస్తున్నట్లు తెలువడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బన్నీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.