ఉక్రెయిన్‌తో కలిసి తాము జీవాయుధాలను అభివృద్ధి చేస్తున్నామని రష్యా చేస్తున్న ప్రచారాన్ని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో విచారణ జరిపించాలని రష్యా ఐరాస రాయబారి కోరడాన్ని తప్పుపట్టాయి. ఐరాస భద్రత మండలిలో సభ్యదేశాలకు రష్యా 310 పేజీల నివేదికను పంచింది. ఇందులో ఉక్రెయిన్ ప్రయోగశాలల్లో అమెరికా సాయంతో జీవాయుధాలు తయారవుతున్నాయని ఆరోపించింది. రష్యా నిరాధార ఆరోపణలు చేస్తోందని అమెరికా ఐరాస రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇతర పశ్చిమ దేశ రాయబారులు కూడా మాస్కో ఆరోపణలను తిరస్కరించాయి. అయితే తాము మాత్రం భద్రతా మండలి విచారణకు పట్టుబడతామని ఐరాసలో రష్యా రాయబారి తెలిపారు.
