భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే 100 శాతం సుంకాలు విధించనున్నట్లు యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ హెచ్చరించారు. భారత్ మాత్రమే కాకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేసి యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యా ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామని ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వార్నింగే ఇచ్చింది.















