పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాలకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు. దీంతో సామూహిక అరెస్టులు, తరగ తుల బహిష్కరణ తో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గత వారం రోజుల్లో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల నుంచి సుమారు 550 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వ విద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 60 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
జార్జియాలోని అట్లాంటాలో గల ఎమోరీ విశ్వవిద్యాలయంలో 20 మంది కమ్యూనిటీ సభ్యులతో సహా 28 మందిని అరెస్ట్ చేశారు. ఇండియానా వర్సిటీలో కనీసం 33 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకు న్నారు. కొందరు నిరసన కారులు సిబ్బందిపై బాటిళ్లు విసరడం వంటి చర్యలకు దిగడంతో వారిని అదుపు చేసేందుకు అధికారులు పెప్పర్ బాల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. ఇక ఇండియానా వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. టెంట్లు వేయొద్దని ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ విద్యార్థులు పట్టించుకోలేదని, దాంతో వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.