లండన్‌లో నిర్వహించిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ వాసులు ఏర్పాటు చేసిన రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లోగో, స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్ లోని భారత హై కమిషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఇండియా డే వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ -టాక్ ప్రాతినిధ్యం వహించింది. భారత హై కమిషనర్ విక్రమ్. కె. దొరైస్వామి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. టాక్ సభ్యులు అతడిని తెలంగాణ చేనేత శాలువాతో సన్మానించారు.ఈ వేడుకల్లో భాగంగా టాక్ సంస్థ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భారీ లోగో తో ఏర్పాటు చేసిన స్టాల్ ఎన్‌ఆర్‌ఐలను విశేషంగా ఆకర్శించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలతో కూడిన సమాచారాన్ని స్టాల్ లో ప్రదర్శించి, అక్కడికి వచ్చిన అతిథులకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని స్టాల్‌లో ఏర్పాటు చేశామని సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. ప్రవాస తెలంగాణ వాసులు స్టాల్‌ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భారీ లోగో, టాక్ స్టాల్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దిన టాక్ ముఖ్య నాయకుడు మల్లా రెడ్డి, అశోక్ గౌడ్ , హరి నవాపేట్ , సురేష్ బుడగం, నవీన్ రెడ్డిని రత్నాకర్ ప్రశంసించారు.సందర్శకులకు వడ్డించిన హైదరాబాద్ బిర్యానీ ఎంతగానో నచ్చిందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం , కార్యదర్శి హరి గౌడ్ నవాపేట్ , కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌పర్సన్ నవీన్ రెడ్డి , , పూజ, పుష్పలత, స్వాతి, స్నేహ తదితరులు పాల్గొన్నారు.