అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు కొనసాగుతున్నాయి. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో వణికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియా లో ఓ చిన్న విమానం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.సౌత్ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ నగరం ఫులర్టన్ లో ఓ చిన్నపాటి విమానం భవనంపై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున పొగ ఎగసిపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 18 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.