ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఇప్పటికే స్పష్టం చేసిన బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం జాతీయ ఆదాయంలో 0.5 శాతం మొత్తాన్ని బ్రిటన్ విదేశీసాయం కోసం వినియోగిస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూకే, రెండేళ్ల క్రితం విదేశీ సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. తాజాగా రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని మరో రెండేళ్లపాటు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విదేశీ సాయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రధానితో పాటు ఛాన్సలర్ ఉమ్మడిగా తీసుకుంటారని యూకే కోశాగారం అధికార ప్రతినిదధి ఒకరు వ్యాఖ్యానించారు.
