భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతినేలా తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా, కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. టొరంటోలో ఖల్సా డే వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రధాని ట్రూడోతోపాటు విపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ట్రూడో సమక్షంలో ఖలిస్థాన్ నినాదాల ఘటనపై న్యూఢిల్లీలోని కెనడా హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీచేసింది. ఈ పరిణామం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, హింసను ప్రోత్సహించేలా ఉందని నిరసన వ్యక్తం చేసింది.