తెలంగాణ రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ బీమా కంపెనీ స్విస్ రే ఒకే చెప్పింది. దావోస్ లో స్విస్ రే కంపెనీ ఎండీ వెరోనికా, ప్రతినిథులతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయి పెట్టుబడుల అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు వారు అంగీకరించారు. బీమా రంగంలో స్విస్ రే కు 160 ఏళ్ల చరిత్ర ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని జురిచ్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా 80 ప్రాంతాల నుంచి ఈ సంస్థ తన కార్యాకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని, తొలుత 250 మంది సిబ్బందితో కంపెనీ ప్రారంభం కానుందని కేటీఆర్ తెలిపారు. డేటా, డిజిటల్ సామర్థ్యాలు, ఉత్పత్తి నమూనాలు, రిస్క్ మేనేజ్ మెంట్ వంటి అంశాలపై స్విస్ రే దృష్టి సారించనుందని తెలిపారు. హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.