తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనామా కాలువ నియంత్రణను అమెరికా ఆధీనంలోని తీసుకువస్తానని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పనామా దేశం అమెరికా కార్గో నౌకల నుంచి అడ్డగోలుగా రుసుములు వసూలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ రుసుములను తగ్గించాలని లేకపోతే మరో మాట లేకుండా కాలువ నియంత్రణను తమకు అప్పగించాలని పనామా దేశాన్ని ఆయన డిమాండ్ చేశారు. అరిజోనాలోని టర్నింగ్ పాయింట్ వద్ద రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో ఆయన మాట్లాడారు. గతంలో అమెరికా మూర్ఖంగా ప్రవర్తించిందని, కాలువ నియంత్రణను పనామా దేశానికి అప్పగించిందని అన్నారు. అప్పటి నుంచి పనామా దేశం రుసుముల పేరుతో అమెరికాను దోచుకుంటోందన్నారు. దీంతో పాటు తన కలల క్యాబినెట్ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందన్నారు. సరిహద్దుల్లో నిఘాను పెంచి అక్రమవలసదారులను అడ్డుకుంటామన్నారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాలు ఆగేలా చర్యలు తీసుకుంటామన్నారు.