మయన్మార్ లోని సైనిక ప్రభుత్వ కోర్టు ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. అక్రమ రీతిలో వాకీటాకీలు కలిగి ఉన్న కేసులో ఆమెకు ఈ శిక్షను వేశారు. కొన్నాళ్ల క్రితం ఆమెను అక్కడి సైన్యాధ్యక్షుడు పదవి నుంచి తొలగించి సైనిక పాలనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె గృహనిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఆమెపై ఉన్న కేసులను విచారించిన కోర్టు ఈ జైలు శిక్షను విధించింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకున్నారనే కేసు, కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కేసులు ఆమెపై మోపడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనే ఆమెకు ఇప్పుడు శిక్ష విధించారు.
మరోవైపు సూకీని అధికారం నుంచి తప్పించి నిర్బంధించిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 ఏళ్ల సూకీకి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలను సైనిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 1,400కు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు. సూకీ లాయర్లను కూడా మీడియాకు దూరంగా ఉంచారు. ఇటీవల ఓ కేసులో రెండేళ్ల పాటు సూకీకి శిక్ష పడిరది. దీంతో మొత్తం జైలు శిక్ష కాలం ఆరేళ్లకు చేరింది.