గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ కీలక నిర్ణయం తీసుకున్నది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వేతనం 18 శాతం పెంచాలని నిర్ణయించింది. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశానికి నెల రోజుల ముందుగా ఆపిల్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీని ప్రకారం 2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్ల (రూ.643 కోట్లు)కు పెరిగిందని తన వార్షిక ప్రాక్సీ ఫైలింగ్‌లో ఆపిల్ వెల్లడించింది. టిమ్ కుక్ కనీస వేతనం మూడు మిలియన్ల డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు పరిహారం రూపేణా 13.5 మిలియన్ డాలర్లు చెల్లిస్తారు. గతేడాది నుంచి టిమ్ కుక్ వార్షిక వేతనం గణనీయంగా పెరిగింది. అంతే కాదు, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆపిల్ తేల్చేసింది.