రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక కార్లలోని లిమోజిన్ లగ్జరీ కారులో పేలుడు సంభవించింది. దీంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే, ఓ వీధిలో జరిగిన ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ పేలుడుకు కారణాలపై క్రెమ్లిన్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కారు విలువ 3,55,796 డాలర్లు (సుమారు 3 కోట్లు). ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ కారు ఇంజిన్ నుంచి మొదట మంటలు వచ్చాయి. ఆ తర్వాత కారులోని ఇతర భాగాలకు వ్యాపించాయి. అక్కడికి సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుంచి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతినడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకుగల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంటుందని తెలిపింది. పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది.
