ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దారుణం చోటు చేసుకున్నది. భారత జాతీయ జెండాను పట్టుకున్న భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా, 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో నిషేధిత సంస్థ అయిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) మెల్బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఖలిస్తాన్ జెండాలు చేత పట్టుకుని నినాదాలు చేశారు. ఇంతలో 25-30 మంది యువకులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ ఫెడరేషన్ స్క్వేర్ వైపు ర్యాలీ నిర్వహించారు. వీరి చేతుల్లో భారత జాతీయ జెండాలు ఉన్నాయి. వీరిని చూడగానే ఖలిస్తాన్ మద్దతుదారులు ఒక్కసారి వారిపైకి దాడికి పాల్పడ్డారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువకులపై కర్రలతో దాడి చేశారు.15 రోజుల వ్యవధిలో మెల్‌బోర్న్‌లో 3 హిందూ దేవాలయాలు వీరి చేతిలో ధ్వంసమైనట్లుగా తెలుస్తున్నది. ఇదే నేపథ్యంలో ఈ సంఘటన జరగడం మరింత ఆందోళనను పెంచుతున్నది.
