అమెరికాలో వలసలు ప్రాణంతకంగా మారుతున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన ఆగి ఉన్న ఓ ట్రక్కులో 46 మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది ఆసుపత్రి పాలయ్యారు. శరణార్థులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శాన్ ఆంటోనియో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెక్సికో బోర్డర్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో శాన్ ఆంటోనియో నగరం ఉంది. అయితే ఇటీవల అక్కడ భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సుమారు వంద మంది వలసదారుల్ని ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే వేడి వాతావరణం వల్ల ఊపిరి ఆడక చాలా మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. 18 టైర్లు ఉన్న ట్రక్కులో మానవ రవాణా జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి ట్రక్కు బయట చనిపోయి ఉండగా, ట్రక్కులో మరికొన్ని శవాలు దొరికాయి. ఇంకా అనేక మంది హీట్‌వేవ్‌తో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకొన్న వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.