2023 ఫిబ్రవరిలో భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి, అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సియాటిల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జాహ్నవిని ఢీకొట్టిన పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్‌ను విధుల నుంచి తొలగించారు. సియాటిల్‌లో జనవరి 23వ తేదీన వీధిని క్రాస్ చేస్తున్న సమయంలో, సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కెవిన్ డేవ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆమె 100 ఫీట్ల దూరంలో పడిపోయింది. ఆ ప్రమాదంలో జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఆ ఘటన పట్ల సియాటిల్ పోలీసు చీఫ్ సూ రాహర్ చర్యలు తీసుకున్నారు. సియాటిల్ పోలీసు శాఖ నుంచి డేవ్‌ను బహిష్కరిస్తున్నట్లు పోలీసులు చీఫ్ తెలిపారు. డేవ్ సుమారు నాలుగు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణ లు ఉన్నాయి. డ్రగ్ ఓవర్‌డోసు బాధిత వ్యక్తిని కాపాడేందుకు వేగంగా వెళ్తున్న ఆఫీసర్ డేవ్, ఆ వేగంలోనే రోడ్డు క్రాస్ చేస్తున్న జాహ్నవిని ఢీకొట్టాడు. అనుకోకుండా ప్రమాదం జరిగినా, దాని పర్యవసానాలను ఆమోదించలేమని పోలీసు చీఫ్ తెలిపారు. పాజటివ్ ఉద్దేశంతో వేగంగా వెళ్తున్నా, అతని నిర్ణయం వల్ల ఓ ప్రాణం బలైందన్నారు. దీంతో సియాటిల్ పోలీసుశాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. జాహ్నవి మృతి పట్ల నవ్వుకుంటూ కామెంట్ చేసిన మరో పోలీసు డేనియల్ ఆడెరర్‌ను కూడా ఫైర్ చేశారు.