అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే 2021, జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించిన 1600 మంది మద్దతుదారులకు ఆయన క్షమాభిక్ష కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెండోసారి బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఆయన అనేక కీలక ఆదేశాలు ఇచ్చారు. జనవరి 6 ఘటనలో నమోదు అయిన 450 క్రిమినల్ కేసులను కూడా డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్‌ను ట్రంప్ ఆదేశించారు.
క్యాపిటల్ హిల్‌పై అటాక్ అమెరికా చరిత్రలోనే హింసాత్మక ఘటనగా రికార్డు అయ్యింది. ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయశాఖ తీవ్ర కసరత్తులు చేసింది. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన అభిమానులు క్యాపిటల్ హిల్‌పై దాడికి దిగారు. ఆ సమయంలో జరిగిన హింసలో వందల సంఖ్యలో పోలీసులు కూడా గాయపడ్డారు. అధికార మార్పిడి సమయంలో ఆ హింస చోటుచేసుకున్నది. క్యాపిటల్ హిల్‌పై అటాక్ చేసిన కేసులో ట్రంప్ మద్దతుదారుల్ని ఇన్నాళ్లు పోలీసులు విచారించగా, ఇప్పుడు ఆ ఆందోళనకారులకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టడం.. అమెరికా పోలీసు శాఖకు మింగుడుపడడం లేదు.