కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు పదవీగండం పొంచిఉన్నది. ఇప్పటికే ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేసి ట్రుడోకు షాకివ్వగా, తాజాగా మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్ పార్టీ నుంచి గట్టి దెబ్బే తగిలేట్లుంది. ట్రుడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నది. శీతాకాల విరామం ముగిసిన వెంటనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో జనవరి 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఖలిస్థానీ మద్దతుదారు, ఎన్‌డీపీ నేత జగ్మిత్ సింగ్ ప్రకటించారు. ఆ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినట్లయితే 9 ఏండ్ల ట్రుడో పాలనకు ఎండ్ కార్డ్ పడ్డట్లే.
లిబర్ పార్టీ నాయకుడు ఎవరనేది తమకు ప్రదానం కాదని, ఈ ప్రభుత్వానికి గడువు ముగిసిందని జగ్మిత్ సింగ్ చెప్పారు. తదుపరి సమావేశాల్లో హౌస్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామని వెల్లడించారు. ప్రధాని పదవిని సమర్థవంతంగా నిర్వహించడంలో ట్రుడో విఫలమయ్యారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ ఓటు వేస్తుందని, తమ కోసం పనిచేసే కొత్త సర్కారును ఎన్నుకోవడానికి కెనడా ప్రజలకు అవకాశం ఇస్తామని తెలిపారు. శీతాకాల విరామం ముగిసిన వెంటనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో జనవరి 27న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు.