బీఆర్‌ఎస్ అధినే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిలిపివేయడాన్ని స్విట్జర్లాండ్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ ఉపయోగించిన అభ్యంతరకర భాష కనపడని ఈసీ, కేవలం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. కేసీఆర్ బస్సుయాత్రకు వస్తున్న జనప్రభంజనం చూసి హైదరాబాద్, ఢిల్లీ నేతల కుర్చీలు కదిలిపోతున్నట్టున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను అడ్డుకునేందుకు బడేమియా, చోటేమియా ఒక్కటై ఆడుతున్న ఆట ఇదని విమర్శించారు.
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ చారిత్రక తీర్పు దిశగా సాగుతున్నదని, నాలుగు నెలల కాంగ్రెసు పాలనలో ప్రజలు విసిగి పోయారని చెప్పారు. కేసీఆర్ పాలన లేకపోవడంతో ప్రజలు బాధపడుతున్నారని, కుహనా మేధావులు, రాజకీయ నిరుద్యోగుల దుష్ప్రచారాలు నమ్మి తమ వేలితో తమ కన్నునే పొడుచుకున్నామని తెలుసుకున్నారని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు గూబగుయ్యుమనేలా ఉంటాయని చెప్పారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్టు దురుద్దేశ పూరితమైనదని, ఆయన ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాల న్నారు.