బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. దబిడి దిబిడే అంటూ సాగే మూడో పాటను విడుదల చేశారు. బాలకృష్ణ సినిమాలోని ఫేమస్ డైలాగ్ దబిడి దిబిడే పేరుతో ఈ పాటను రూపొందించారు.
తమన్ సంగీతాన్నందించిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు. వాగ్దేవి ఆలపించింది. ఈ పాటలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా నృత్యాలు ప్రధానాకర్షణగా నిలిచాయి. కొరియోగ్రాఫర్ శేఖర్ వీజే చక్కటి నృత్యరీతుల్ని సమకూర్చారు. అదిరి పోయే మాస్ స్టెప్పులతో ఈ పాట హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు నటిస్తున్నారు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో జనవరి 4న Texas Trust CU Theatre లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్, సంగీతం: తమన్, దర్శకత్వం: బాబీ కొల్లి.