భౌగోళిక, ఆర్థిక కారణాల దృష్ట్యా బహ్రెయిన్‌లో నివసించే తెలుగువారితో సహా భారతీయుల సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే స్వల్పమైనా సంస్కృతి, ఆచార వ్యవహారాల విషయంలో బహ్రెయిన్‌లోని ప్రవాసీయులు ఇతరులకు ఏ మాత్రం తక్కువ కాదు, పైగా కొంచెం పై చేయిగా ఉంటారు. ఈసా టౌన్లో మధ్య తరగతి లేదా సల్మాబాద్‌లో సగటు కార్మికుడు ఎవరైన సరే, సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు లేదా ఉత్సవాలు వస్తే అందరు సమానమే. ఈ క్రమంలో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణ సంప్రదాయక పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను కలిపి బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీయులందరి కొరకు బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఆదిలియాలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతీయ ఎంబసీలోని యువ దౌత్యవేత్త ప్రియాంక త్యాగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఫణిభూషణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంశీ, కోశాధికారి మురళీ, సాంస్కృతిక కార్యదర్శి ఫణి హనుమంతరావు, క్రీడా కార్యదర్శి రామ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.