రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ మరోసారి విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య కీలక భేటీకి ముందు రాజధాని కీవ్‌పై బాంబుల వర్షం కురిపించింది. శనివారం తెల్లవారుజామున కీవ్‌తోపాటూ ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. రష్యా దాడితో కీవ్ నగరం ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. అయితే, ఈ దాడిలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి నివేదికలూ లేవు.

కాగా, అమెరికాలోని ఫ్లోరిడాలో డిసెంబర్ 28వ తేదీన ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చొరవతో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ భేటీలో శాంతి ప్రణాళిక, భద్రతా హామీలు, ఆర్థిక ఒప్పందాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలక భేటీకి ముందు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడటం గమనార్హం.















