సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా భువన విజయమ్. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. కిరణ్, వీఎస్కే నిర్మాతలు. దర్శకుడు యలమంద చరణ్ రూపొందించారు. తాజాగా చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు. ఒక ప్రొడ్యూసర్.. అతనికి జాతకాల పిచ్చి. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు. అనుకోకుండా రైటర్‌గా మారిన ఓ దొంగ.. వీళ్ల మధ్యలో తిరుగుతున్న ఓ ఆత్మ.. రకరకాల పాత్రల నేపథ్యంలో సాగిన ఈ టీజర్‌లో నటీనటులు వారి టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు యలమంద చరణ్ మాట్లాడుతూ కామెడీ డ్రామా చిత్రమిది. ఆద్యంతం నవ్వులు పంచేలా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే అన్ని జానర్స్ కలిపి రూపొందించాం. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. వేసవిలో మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సాయి, సంగీతం : శేఖర్ చంద్ర. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
