సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాళా తీయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్వీబీ దివాళా తీయడంతో టెక్నాలజీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఎస్వీబీ దివాళా తీయడం అమెరికా బ్యాంకింగ్ చరిత్రలోనే రెండో అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యం అని పేర్కొన్నారు. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) పతనాన్ని చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. ఇది హై-టెక్ వరల్డ్‌లోనే అతిపెద్ద సంక్షోభానికి దారి తీసింది అని పేర్కొన్నారు. ఎస్వీబీ దివాళా వల్ల ఇజ్రాయెల్ టెక్ పరిశ్రమపై ప్రభావం పడుతుందా? అన్న కోణంలో తమ దేశంలోని సీనియర్ టెక్నాలజీ నిపుణులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే ఇజ్రాయెల్ హై-టెక్ కంపెనీలు, వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగుల రక్షణకు బాధ్యతలు తీసుకుంటాం. ఈ సంక్షోభం వల్ల నిధుల కొరత సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైందని, శక్తిమంతమైందని, ఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొంటుందని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు.
