తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) సింగపూర్ లో జరుగబోయే బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ లో సింగపూర్ బోనాల పండుగ 09 జూలై న జరుగనున్నది. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజునే సింగపూర్ లో నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం బోనాల జాతర మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని సమన్వయ కర్తలు తెలిపారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనాలని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ పిలుపునిచ్చింది.


సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. అందరూ ఈ బోనాల వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగ ను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకోవడంతో పాటు, ప్రతి ఏడాది జరుపోకోవడం సంతోషకరం అన్నారు.

