బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత మౌనం వీడారు. తాను, తమ ప్రభుత్వం వల్ల కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించిన లిజ్ ట్రస్.. వాగ్దానాల ఉల్లంఘనకు క్షమించమని వేడుకుంటున్నానన్నారు. నిజాయితీ గల రాజకీయ నాయకుడు మాత్రమే తప్పులను అంగీకరిస్తారని, తాను అదే పని చేశానని చెప్పారు. తాను తీసుకొచ్చిన ‘లో ట్యాక్స్ అండ్ హై గ్రోత్’ ఫార్ములా కొనసాగి తీరుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కన్జర్వేటివ్ పార్టీ తన నాయకత్వంలోనే పనిచేస్తుందని చెప్పారు.
సొంత పార్టీ ఎంపీ జెరేమీ హంట్ పేరును లేవనెత్తకుండా.. ‘నేను ప్రధానమంత్రి పదవిలోకి వచ్చి నెల రోజులే అయ్యింది. విషయాలు సరైన మార్గంలో నడవడం లేదని అంగీకరిస్తున్నాను. త్వరలో వాటిని పరిష్కరిస్తాం. ఇప్పుడు ట్రాక్‌లోకి రావాలంటే ఇతర మార్గాలను అవలంబించాలి’ అని చెప్పారు. తక్కువ పన్ను, అధిక వృద్ధి ఫార్ములా కొనసాగుతుందని చెప్పిన లిజ్ ట్రస్.. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే ప్రాధాన్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు.
లిజ్ ట్రస్ బ్రిటీష్ ప్రధానమంత్రిగా నియమితులై 40 రోజులు మాత్రమే అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. లిజ్ పార్టీకి చెందిన ఎంపీలు స్వయంగా పలు ప్రశ్నలను లేవనెత్తడంతో ట్రస్ స్థానంలో మరో నేతను ప్రధానిని చేయవచ్చనే వార్తలు కూడా వినిపించాయి.