అమెరికాలోని డల్లాస్ బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు వేదికైంది. బీఆర్‌ఎస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఫిస్కోలోని డా. పెప్పర్ ఎరీనాలో భారాస రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు అమెరికావ్యాప్తంగా నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సభాస్థలి గులాబీమయమైంది. జై తెలంగాణా నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. గులాబీ జెండాలు, తెలంగాణ ఆట, పాటలతో ఎన్‌ఆర్‌ఐలు సందడి చేశారు. ప్రవాస చిన్నారులు, మహిళలు తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో అలరించారు. బతుకమ్మ పాటలకు కోలాటాలు ఆడుతూ మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.


కేటీఆర్ స్పీచ్‌కు మంచి స్పందన లభించింది. తెలంగాణ మట్టివాసనను అమెరికాకు మోసుకొచ్చిన ప్రవాసులు తమ శ్రమను, సమయాన్ని అభివృద్ధికి వినియోగించడం ఆనందించాల్సిన విషయమమని ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి కేటీఆర్ అన్నప్పుడు చప్పట్లతో మారుమ్రోగింది. తెలంగాణా రత్నాలుగా, భరతమాత ముద్దుబిడ్డలుగా, తెలుగుతేజాలుగా అమెరికాలో అందరూ రాణించాలని, తెలంగాణా నినాదాన్ని గట్టిగా-గర్వంగా చాటిచెప్పాలని చెప్పడంతో సంబురపడ్డారు. అంతకుముందు బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ అమెరికా విభాగం అధ్యక్షుడు తన్నీరు మహేష్ స్వాగతోపన్యాసం చేశారు. బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కన్వీనర్ మహేష్ బిగాల సభికులకు ధన్యవాదాలు తెలిపారు.
