అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపింది. సెనేట్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా, ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో 35 మంది పాల్గొన్నారు. అందులో బిల్లుకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా, ఒకరు మాత్రమే దానికి వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. దీంతో బిల్లు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించారు. త్వరలో ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పంపిస్తామని, అక్కడ పాస్ అయ్యాక గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని తెలిపారు. గవర్నర్ సంతకం చేశాక ఈ ఎస్‌బీ 403 బిల్లు చట్టంగా మారుతుందని వివరించారు.


కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని, దానిని రూపు మాపాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ ఐషా వాహబ్ ఎస్‌బీ 403 బిల్లును రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కులం కారణంగా వివక్ష చూపడం, హింసకు పాల్పడటం చట్ట విరుద్ధంగా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నిచోట్లా అందరికీ సమాన అవకాశాలు, సదుపాయాలు, సేవలు అందాలని ఐషా వాహబ్ అన్నారు. ఇందులో భాగంగా వివక్షను ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించేందుకు అవసరమైన విధివిధానాలతో ఎస్‌బీ 403 బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సెనేట్ ఆమోదం పొందడంపై ఐషా సంతోషం వ్యక్తం చేశారు.
