కాల్పుల ఘటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లిందన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఏదో తేడాగా ఉందని అర్థమైందని, తన చెవిని తాకుతూ తూటా దూసకెళ్లి తీవ్ర రక్తస్రావమైందన్నారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలో ఇలాంటి ఘటన జరగడాన్ని నమ్మలేకపోతున్నా. నన్ను కాల్చిన ఒక బుల్లెట్ నా కుడి చెవి పైభాగాన్ని తాకింది. బుల్లెట్ శబ్ధం విని ఏదో జరుగుతున్నది అని అనుకుంటుండగానే నాకు బుల్లెట్ తగిలింది. తీవ్ర రక్తస్రావం అయ్యింది. అప్పుడు నాకు ఏం జరిగిందో అర్థమైంది. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ఆయన పేర్కొన్నారు. ఊహించని పరిణామం నుంచి ఆ దేవుడే కాపాడాడు. ఈ సమయంలో అమెరికన్లు ఐక్యం గా నిలబడాల్సిన అవసరం ఉంది. మన అసలైన స్వభావాన్ని చాటి, చెడు గెలవకుండా చూడాలి అని పిలుపు నిచ్చారు. ఆటుపోట్లను తట్టుకుంటామన్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో యుఎస్‌ఎ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ చేపడతుండగా ఆయనపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. భద్రతా బలగాలు దుండగుడిపై కాల్పలు జరపడంతో హతమయ్యాడు. ఈ కాల్పుల్లో దుండగుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. ట్రంప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.