చైనాతో భారత్ సంబంధాలు ఎంతో సంక్లిష్ట దశలో ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఒప్పందాలను బీజింగ్ కాలరాస్తోందన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులే ద్వైపాక్షిక సంబంధాలను నిర్ణయిస్తాయని తెలిపారు. మ్యూనిక్ సెక్యూరిటీ సదస్సు 2022 ప్యానెల్ చర్చలో భాగంగా జై శంకర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. చైనా, భారత్ మధ్య 45 ఏళ్లుగా శాంతి నెలకొంది. ఆ దేశంతో స్థిరమైన సరిహద్దు ఒప్పందం ఉంది. 1975 నుంచి సరిహద్దుల్లో సైనిక మరణాలు కూడా లేవని తెలిపారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. వాస్తవాధీన రేఖ వద్దకు సైనిక దళాలను తీసుకురాకూడదన్న విషయమై చైనాతో ఒప్పందాలున్నాయి. చైనా ఈ ఒప్పందాలను ఉల్లంఘించింది అని జై శంకర్ చైనాతో భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించారు. కనుక చైనాతో సంబంధాలు క్లిష్ట దశలో ఉన్నట్లు తెలిపారు.
సరిహద్దుల్లోని ఒక్కసారిగా భారీ సంఖ్యలో బలగాల మోహరింపు చేయకూడదని చైనాతో ఒప్పందం ఉందని, చైనా దానిని పక్కకు పెట్టి, భారీ సంఖ్యలో బలగాలను మోహరించిందని, అందుకే ఎల్‌ఏసీ వెంబడి అంత స్థాయిలో ఉద్రికత్తలు తలెత్తాయని అన్నారు. అంత పెద్ద దేశమే ఒప్పందాలను తుంగలో తొక్కేస్తే అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి సారించాల్సిందేనని స్పష్టం చేశారు.