
దేశంలో జననాల రేటును పెంచేందుకు ఇటీవలే కండోమ్‌పై ట్యాక్స్ విధించిన చైనా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ఆ తరువాత అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా ఒక విధానాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రసవ సంబంధిత వైద్య ఖర్చుల్లో పౌరులు తమ జేబులో నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చైనా నేషనల్ హెల్త్‌కేర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. గర్భధారణ అనంతరం మెడికల్ చెకప్‌లు, ప్రసవం సమయంలో అందించే సేవలు, ప్రసవం తరువాత జరిగే చికిత్స ఖర్చులను కూడా ఈ పాలిసీలో భాగం చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా పలు ప్రావిన్స్‌లలో అమలు చేస్తున్నామని, త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొంది.















