అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని చైనా ఫైటర్ జెట్ అడ్డుకున్నది. తమ గగనతలంలోకి రావద్దంటూ అమెరికా విమాన పైలట్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్ర గగనతలంలో ఈ సంఘటన జరిగింది. అమెరికా నేవీకి చెందిన పీ-8 పోసిడాన్ విమానం దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవుల సమీపంలో 21,500 అడుగుల ఎత్తులో ఎగిరింది. ఇంతలో క్షిపణులతో కూడిన చైనా జెట్, అమెరికా విమానం వైపు వచ్చింది. కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఆ చైనా జెట్ సుమారు 15 నిమిషాలపాటు యూఎస్ గస్తీ విమానాన్ని అనుసరించి అడ్డుకుంది. ఈ సందర్భంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌కు ఒక సందేశం వచ్చింది. చైనా గగనతలం 12 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికా విమానం దారి మళ్లింది. చైనా జెట్ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయిది.