రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కలియతిరిగారు. పోలీస్ ఉన్నతాధికారులను అడిగి సెంటర్ విశేషాలు తెలుసుకున్నారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం పోలీస్ విభాగానికి మూడో నిఘా నేత్రంగా పనిచేయనుంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు లక్ష కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిప్టుల వారీగా సిబ్బంది పని చేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.
అంతకు ముందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిచారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పోలీస్ హౌసింగ్ కార్పొరేటషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














