తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని , నూతన జాతీయ పార్టీ స్థాపించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ ఎన్నారైలు తెలిపారు. ఈ విషయమై చారిత్రక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద ఎన్నారైలు సమావేశమయ్యారు. యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్)లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల ఎన్నారైలు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలని కోరారు. భారతదేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతా ఈనాడు తెలంగాణ మోడల్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తం కావాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అని ఎన్నారైలు తెలిపారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతోపాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా `దేశ్‌కీ నేత కేసీఆర్` అంటూ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ భారీ కటౌట్ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.