వెంకటేశ్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూసేలా సంక్రాంతి సినిమా ఉండాలి. అలాగే ఈ సినిమా ఉంటుంది. అనిల్ చక్కగా తీశాడు. మా సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, గేమ్‌చేంజర్ కూడా పెద్ద హిట్లు అవ్వాలి అని అన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ట్రైలర్‌ని మించి సినిమా ఉంటుంది. ఇదొక టిపికల్ జానర్. ప్రియురాలికీ, భార్యకీ మధ్య నలిగిపోయే అద్భుతమైన పాత్ర వెంకీ చేశారు. ఆయన కెరీర్లో చాలా గొప్ప పాత్రలు చేశారు. వాటిలో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఐశ్వర్య, మీనాక్షి కూడా అద్భుతంగా నటించారు. దిల్‌రాజుగారి బ్యానర్‌లో నేను చేసిన 5వ సినిమా ఇది. ఇన్ని అవకాశాలిచ్చిన రాజుగారికి థ్యాంక్స్. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది అని నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, కథానాయికలు ఐశ్వర్యరాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్‌లతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణగుప్త కూడా మాట్లాడారు. చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది.