దుబాయి నగరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఉత్తర తెలంగాణను కేంద్రంగా చేసుకొని నగరంలోని వివిధ లేబర్ క్యాంపులలో లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ ఎన్నారై సెల్ యుఏఈ అధ్యక్షుడు యస్వీ రెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకొంది.
బర్ దుబాయి, అల్ ఘోసేస్‌లతో పాటు సోనాపూర్, జబల్ అలీలలోని లేబర్ క్యాంపులలో నివసిస్తున్న వేలాది మంది తెలంగాణ ప్రవాసీయులను సాయంత్రం వేళల్లో వ్యక్తిగతంగా కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయమని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు సూచించవల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. దుబాయి నగరంతో పాటు షార్జా, ఇతర ఎమిరేట్లలో కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లుగా యస్వీ రెడ్డి పేర్కొన్నారు. విధులు ముగించుకొని సాయంత్రం వేళ కార్మికులు తిరిగి వచ్చిన సమయంలో మాత్రమే ప్రచారం చేయడానికి వీలుంటుందని ఆయన అన్నారు.